విశాఖపట్నం మధురవాడ పరిధిలోని మారికవలస డంపింగ్ యార్డ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. యార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సి అండ్ డి (C&D) వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణతో పాటు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
ఇటీవల మరో ఆరు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేశామని, రాబోయే రెండేళ్లలో అవి ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సేకరించే చెత్తలో సుమారు 6,500 టన్నులను ఈ ప్లాంట్లకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ను రోజుకు 1,200 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పేరుకుపోయిన సుమారు 148 లక్షల టన్నుల లెగసీ వేస్ట్‌ను క్లియర్ చేసినట్లు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

