శృంగవరపుకోటలోని లక్కవరపుకోట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దంపతులు, టీడీపీ సీనియర్ నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ సీనియర్ నేత కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి, 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి పనిచేస్తాయని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని నేతలు పేర్కొన్నారు.

