మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్షర యూత్ సభ్యులు గత ఏడు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం దశావతారాల్లోని ఒక్కో అవతారాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణపతి విగ్రహాలను రూపొందించి పూజలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. అక్షర యూత్ కార్యక్రమాలను జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జలవనరులు కలుషితం కాకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

