మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా వినూత్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండపం వద్ద అన్నదానం చేయడం కంటే ఆకలితో ఉన్న వారి వద్దకే అన్నప్రసాదాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారసంతలోని చిరు వ్యాపారులు, వికలాంగులు, నిరుపేదలకు 300 వెజిటేబుల్ బిర్యానీ బాక్సులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. మండలి సభ్యులు, మహిళలు స్వయంగా వాహనంలో ఆహారాన్ని తీసుకెళ్లి ఒక్కొక్కరి వద్దకు వెళ్లి అందించారు.
గత ఐదేళ్లుగా ఇదే విధంగా నిరుపేదలకు అన్నప్రసాద బాక్సులు అందిస్తున్నామని మండలి సభ్యులు పల్లెర్ల మనోహర్, దుర్గాప్రసాద్ తెలిపారు. ఆకలితో ఉన్నవారి వద్దకు వెళ్లి అన్నం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంతలోని చిరు వ్యాపారులు, నిరుపేదలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పల్లెర్ల సురేష్, పల్లెర్ల మనోహర్, దుర్గాప్రసాద్, బొల్లం రామకృష్ణ, పల్లెర్ల శివకుమార్, కజ్జం రమేష్ బాబు, నల్మాస్ శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, గోయికారి వాసు, బొద్దుకూరి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

