విశాఖపట్నం వేపగుంటలో సమైక్య ప్రజా & రైతు సంక్షేమ సంఘం (పంచ గ్రామాల భూముల కమిటీ) ఆధ్వర్యంలో పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా PVSSL శాస్త్రి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యతో సుమారు లక్ష మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరిస్తామని పలువురు నాయకులు హామీలు ఇస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు.
P. రమణి మాట్లాడుతూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పట్టాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా సమస్య కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుపైనా ఆమె విమర్శలు చేశారు. ప్రతి సంవత్సరం శంకుస్థాపనలు చేయడం కాకుండా భూ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కోసం ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామని ఆమె తెలిపారు.

