తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం సహా పలు ప్రధాన రిజర్వాయర్లను నీటిపారుదల, విద్యుత్ శాఖలు సంయుక్తంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు.
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో అధిక వ్యయం ప్రధాన సవాలుగా ఉందని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లకు చేరిందని, పేదలు, రైతుల విద్యుత్ సబ్సిడీల కోసం ఏటా రూ.19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అమ్రాబాద్ పరిధిలో 80 గ్రామాలను సోలరైజ్ చేసే పైలట్ ప్రాజెక్ట్‌తో పాటు మైక్రో గ్రిడ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

