1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేం ముందస్తు విడుదల కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 25 ఏళ్ల శిక్ష పూర్తయిందని, రెమిషన్ను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడుదల చేయాలని ఆయన చేసిన అభ్యర్థనను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
2005 నవంబర్ 11న భారత్కు అప్పగించబడిన సలేం శిక్షాకాలాన్ని అదే తేదీ నుంచి లెక్కిస్తే 25 ఏళ్లు 2030 నవంబర్లో పూర్తవుతాయని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విధించిన 25 ఏళ్ల శిక్షను సాధారణ జైలు రెమిషన్తో తగ్గించలేమన్న బాంబే హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీంతో అబూ సలేం 2030 వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

