జమ్ముకాశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. శ్రీనగర్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించే సమయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా గౌరవసూచకంగా నిలబడటంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ సూచనలను ఎన్సీ తిరస్కరిస్తూ జాతీయ గీతాలను గౌరవించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో రెండు పార్టీల బలాబలాలు, రాష్ట్ర హోదా, రాజ్యసభ సీట్ల కేటాయింపు వంటి అంశాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా వివాదం కూటమిలో ఆధిపత్య పోరును మరింత స్పష్టంగా చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

