తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మెట్పల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని అధికారికంగా గుర్తించి, నాటి పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
నాటి తెలంగాణ విమోచన పోరాటంలో రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజలు చేసిన త్యాగాలను బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ గుర్తుచేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ రాజకీయ సంకల్పం, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో కీలక పాత్ర పోషించాయని పేర్కొంటూ, అమరవీరుల త్యాగాలను గౌరవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

