జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మెట్పల్లి మున్సిపాలిటీకి చెందిన చెత్త బండి వాహనంలో వినాయక విగ్రహాలను తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టాయి.
వినాయక విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం హిందూ దేవుళ్లను అవమానించడమేనని, ఇందుకు బాధ్యులైన అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని కూడా వారు కోరారు.
ఆందోళన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వినాయక విగ్రహాలను వేరే ఆటోలో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో బీజేపీ, ఇతర హిందూ సంఘాలు ఆందోళనను విరమించాయి.

