కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సమాచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, దానిని పట్టుకునేందుకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పులి జనావాసాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో నిరంతర నిఘా కొనసాగిస్తూ రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.A

