
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘పోరుబాట’ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

