విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ, నిరసన నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశాల మేరకు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ, విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

