ఫూకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 4న 145 మందితో ప్రయాణిస్తున్న ఏఐ-2379 విమానం ఒడిశా గగనతలంలో 36,000 అడుగుల ఎత్తులో ఉండగా మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో విమానం ఒక్కసారిగా పైకి ఎగసి, వెంటనే కిందకు పడిపోవడంతో తీవ్ర కుదుపులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికలో సంచలన అంశాన్ని వెల్లడించింది. విమానం పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్వహించిన సైకోయాక్టివ్ పదార్థాల గుర్తింపు పరీక్షలో ఫలితం ‘నాన్-నెగెటివ్’గా వచ్చింది. అనంతరం నిర్వహించిన కన్ఫర్మేటరీ పరీక్షలోనూ ఇదే ఫలితం నమోదైంది. కో-పైలట్‌కు నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలింది.
ఈ ఫలితాల నేపథ్యంలో సంబంధిత పైలట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని AAIB, DGCAకు సిఫార్సు చేసింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనలను సహించబోమని తెలిపింది. ఘటన అనంతరం తమ పైలట్లందరికీ స్వచ్ఛందంగా డ్రగ్స్ పరీక్షలు ప్రారంభించినట్లు వెల్లడించింది. విమానంలోని సాంకేతిక, ఇతర అంశాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

