భారత్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్న ఐదు కీలక రంగాలను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా గుర్తించారు. మౌలిక వసతులు, చిన్న రైతుల ఆధారిత వ్యవసాయం, ప్రాథమిక ఆరోగ్య సేవలు, పర్యాటకం, విలువ ఆధారిత తయారీ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడొచ్చని తెలిపారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.
ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బంగా మాట్లాడుతూ.. భారత్ ఆర్థిక వృద్ధిని యువతకు ఉద్యోగాలుగా మార్చాలంటే ప్రైవేట్ పెట్టుబడులు ఎంతో కీలకమని చెప్పారు. ప్రభుత్వం అవసరమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించగలదని అన్నారు. రహదారులు, నిర్మాణ రంగం, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం, స్థానిక స్థాయిలో క్లినిక్లు వంటి వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుందని వివరించారు.
అదేవిధంగా పర్యాటక రంగాన్ని కూడా భారీ ఉపాధి అవకాశాలు ఉన్న రంగంగా బంగా అభివర్ణించారు. ఇక ఖనిజాలు, లోహాలు, ఫ్యాషన్ వంటి రంగాల్లో విలువ ఆధారిత తయారీని పెంచడం ద్వారా ఉద్యోగాలతో పాటు ఆర్థిక విలువను కూడా పెంచుకోవచ్చని తెలిపారు. యువ జనాభా ఉన్న భారత్ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక వృద్ధితో పాటు భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

