అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ప్రొడక్షన్ బ్లాక్–2లో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ఆ బ్లాక్‌లో సుమారు 40 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యాజమాన్యం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరుస అగ్నిప్రమాదాలతో ఫార్మాసిటీ మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల టొరంటో ఫార్మా, లోహిత లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రమాదాలు జరగగా, తాజాగా శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రమాదం చోటుచేసుకోవడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొంది.