
జల్సాల కోసం నేరబాట పట్టిన బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ను పీఎంపాలెం క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ చూసి ద్విచక్ర వాహనాల దొంగతనాలు నేర్చుకున్న నిందితుడి నుంచి లక్షల విలువైన 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తర విభాగం క్రైమ్ ఏసీపీ ఎ. వెంకటరావు, ఇన్స్పెక్టర్ బి.ఎస్.ఎస్. ప్రకాష్ కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కొండవలసకు చెందిన బేరి తులసి నాయుడు ఉద్యోగం కోసం విశాఖలోని మధురవాడకు వచ్చి మారికవలస రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను యూట్యూబ్ ద్వారా బైక్ చోరీ విధానాలు నేర్చుకుని, తెలిసిన వారి బండ్లకు డూప్లికేట్ తాళాలు తయారు చేయించి దొంగతనాలకు పాల్పడేవాడు. దొంగిలించిన వాహనాలను తక్కువ ధరలకు విక్రయించేవాడు. జూన్ 24న మధురవాడకు చెందిన ఎ. రమణ తన పల్సర్ బైక్ చోరీపై ఫిర్యాదు చేయడంతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ ఎస్ఐ ఎస్. సూర్య ప్రకాష్ రావు నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫుటేజీ, ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి ఈ నెల 13న అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి పల్సర్ బైక్‌తో పాటు కశింకోటలో చోరీ చేసిన గ్లామర్ బైక్‌ను రికవరీ చేశారు. అలాగే తక్కువ ధరకు బైక్‌లు కొనుగోలు చేసిన అప్పలనాయుడు, నానాజీ, భాస్కర్‌రావు, హరి సురేష్లను గుర్తించి వారి వద్ద నుంచి మిగిలిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాన్ని సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ప్రత్యేకంగా అభినందించారు.

