విశాఖపట్నం వీఎంఆర్డీఏలో జరుగుతున్న అవినీతి, దుబారా ఖర్చులపై జనసేన పోరాటం కొనసాగుతుందని జనసేన నేతలు స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల సంస్థకు తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోందని ప్రశ్నించామని తెలిపారు. అయితే ఈ అంశాలపై వివరణ ఇవ్వాల్సిన వీఎంఆర్డీఏ అథారిటీ, రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ లీగల్ నోటీసు పంపడం ఆశ్చర్యకరమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే కేసులతో బెదిరించడం సరికాదని, అలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని అన్నారు. ఈ లీగల్ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని, నోటీసు ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో వీధి దీపాల కోసం రూ.20 వేలతో పూర్తయ్యే ఆక్టాగోనల్ పోల్స్ బదులు, ఒక్కో డెకరేటివ్ పోల్కు రూ.75 వేల వరకు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఒక్కో పోల్లో రూ.25 వేల వరకు లంచాల రూపంలో దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రూ.4 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.10 కోట్లకు పెంచి, అదనంగా రూ.5 నుంచి రూ.6 కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు. వీఎంఆర్డీఏలో జరుగుతున్న అక్రమాలపై గత 10వ తేదీన బయటపెట్టింది కేవలం టీజర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, పర్యావరణం, ప్రజా ధనాన్ని కాపాడటం ఒక నగర పౌరుడిగా, జనసైనికుడిగా తమ బాధ్యత అని అన్నారు.