జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వే ఫారాలు ఇంటింటికీ చేరలేదని స్థానికులు రవిశంకర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంబంధిత బీఎల్ఓను ప్రశ్నించగా, ఇప్పటివరకు సగం మంది మాత్రమే ఫారాలు నింపి ఇచ్చారని, మిగిలిన వారి ఫారాలను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడి, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఇంకా చాలా మందికి ఎస్ఐఆర్ ఫారాలు అందలేదని, సంబంధిత అధికారులతో త్వరగా ప్రక్రియ పూర్తి చేయించాలని కోరారు. అనంతరం ఆర్డీవో మధుసూదన్‌తో ఫోన్లో మాట్లాడుతూ, మండలంలోని ప్రతి ఓటర్ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పలువురు బాధితులతో కలిసి బీఎల్ఓ ఇంటికి వెళ్లి, మిగిలిన ప్రతి ఇంటి నుంచి ఫారాలు సేకరించి వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఫారాల సేకరణలో జాప్యం జరిగితే పలువురు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.