విద్యార్థులు సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకోవాలని ఆదిలాబాదు జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం సోనాల మండల కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట రాగి జావ వంటి పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు రాగి జావ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జంక్ ఫుడ్స్, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ ఫిర్యాదులను హెచ్ఎంతో కలిసి కమిటీ పరిశీలించి పరిష్కరిస్తుందని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లను కేవలం చదువు కోసం మాత్రమే ఉపయోగించాలని, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ క్రీడల్లోనూ రాణించాలని హితవు పలికారు. పాఠశాల అభివృద్ధికి డీఆర్డీఓ సహకారంతో న్యూట్రీ గార్డెన్స్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మండలంలో కొత్త ఎంఆర్ఓ కార్యాలయ భవన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.