సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి 5 వేల మంది యువతను సదస్సుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నిస్తే జైలులో పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను గాలికి వదిలేసిందని, యువతకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్న ఓట్లను తీసేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే పది రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని సూచించారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్‌లలో సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలోనే ముందుండేలా ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.