లాస్ ఏంజెల్స్‌లో ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు ఎన్నారై టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయని కీలక ప్రకటన చేశారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ఆరెంజ్ సిటీలోని తండూరి రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకకు 150 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేశ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇప్పటికే నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించామని, త్వరలోనే మలేషియా, హాంగ్ కాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా సర్వీసులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కూటమి విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదని కొనియాడారు.











