హైదరాబాద్ కూకట్పపల్లి పరిధిలోని షంషిగూడలోని నక్షత్రరూప ధర్మశాస్త దేవస్థానం ట్రస్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. ట్రస్ట్‌కు ISO 9001:2015 నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధ్రువీకరణ పత్రం లభించింది. వి.జె. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ బృందం అందించిన ఈ ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ భాస్కర్, వైస్ చైర్మన్ బాలరాజు స్వీకరించారు. దేవస్థానం నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ అరుదైన గౌరవం దక్కేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.