కేబుల్ టీవీ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, రంగ సమస్యల పరిష్కారంపై సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. సమావేశానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జేఏసీ ముఖ్య సలహాదారు పాశం యాదగిరి, టీజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షుడు కే. కోటేశ్వరరావు, ఎంఎస్‌వో ప్రతినిధి కోలా కిషోర్ గౌడ్ హాజరయ్యారు. డిజిటల్ మీడియా విస్తరణతో కేబుల్ టీవీ జర్నలిస్టుల పాత్ర మరింత పెరిగిందని, అయినప్పటికీ వారికి తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు, అక్రిడిటేషన్ సౌకర్యాలు అందడం లేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా ప్రధాన మీడియా ప్రతినిధులుగా గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేబుల్ టీవీ రంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అతిథులు హామీ ఇచ్చారు. హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ జర్నలిస్టులు, నిర్వాహకులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్లు బి. నరసింహచారి, భరత్‌కుమార్, డా. మహ్మద్ యాసిఫ్ పాషా, పొదిళ్ల వెంకట్, మహేష్‌కుమార్ ఉపాధ్యాయ, రాచర్ల గోపి, డా. బాను ప్రసాద్, పీట్ల ప్రతాప్, జితేందర్, శ్రీనివాస్, వేణుగోపాల్, కలీమ్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. కేబుల్ టీవీ జర్నలిస్టుల హక్కుల సాధనకు ఈ సమావేశం బలమైన వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.


