అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశం
  • తీవ్ర ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించాలని సూచన
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని స్పష్టం
  • ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో, చేపట్టాల్సిన సన్నద్ధత చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హీట్‌వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటి ద్వారా ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయితీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com