ఎల్బీనగర్ – ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు హ్యామ్ రోడ్లతో కొత్త రూపు: ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

  • పెద్ద అంబర్‌పేట్ – మునగనూరు ఫోర్ లేన్ రోడ్డు పనులను పరిశీలించిన రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్

  • ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పనుల వేగవంతం

ఇబ్రహీంపట్నం/ఎల్బీనగర్, మే 22 :

“ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న హ్యామ్ (HAM – Hybrid Annuity Model) రోడ్ల వల్ల ఈ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి” అని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSRDC) ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి స్పష్టం చేశారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ నుంచి మునగనూరు వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు లేన్ల (బిటి) రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం ఆయన రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ (ENC) మోహన్ నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు.

ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి

ఈ సందర్భంగా ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని, ఈ కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త హ్యామ్ రోడ్ల ప్రాజెక్టును మంజూరు చేయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం రోడ్ల నెట్‌వర్క్ బలోపేతానికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఈ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని వివరించారు.

మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నిధులు

ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు, అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి నియోజకవర్గాల అభివృద్ధి కోసం, నిధుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

పెద్ద అంబర్‌పేట్ – మునగనూరు ప్రధాన రహదారి విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాంరెడ్డి భరోసా ఇచ్చారు.

పాల్గొన్న అధికారులు, నాయకులు:

ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఆర్‌ అండ్ బీ (R&B) శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com