-
మే చివరిలోగా గ్రామ, మండల కమిటీల భర్తీకి ఆదేశం
-
గిగ్ వర్కర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపు
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్, మే 01
: తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహా ఇంచార్జ్‌లు రోషిణి జైస్వాల్, భవ్య గార్లతో కలిసి జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కమిటీల భర్తీ – సంస్థాగత బలోపేతం
ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ఇందిరా పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతం కావడం సంతోషకరమని, ఇది కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. మే చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న కమిటీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. యూత్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ “With IYC” యాప్‌పై అవగాహన పెంచాలని సూచించారు.
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పోరాటం
రాహుల్ గాంధీ పిలుపు మేరకు చేపట్టిన “గిగ్ వర్కర్ న్యాయ అభియాన్” కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ చురుకుగా పాల్గొనాలని కోరారు. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం వారిని విస్తృతంగా నమోదు చేయించాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
కష్టపడే వారికే గుర్తింపు
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే యువ నాయకులకు భవిష్యత్తులో రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తామని శివచరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా, సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మరణించిన యూత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




