-
ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలి: వ్యవసాయ శాస్త్రవేత్తలు
-
రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలి
-
శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి సమావేశం
షాబాద్, మే 02 : రాబోయే వానాకాలం (ఖరీఫ్)-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని, ముఖ్యంగా రసాయన మందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని తాళ్లపల్లి రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
మెరుగైన సాగు – తక్కువ ఖర్చు
ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ భద్రు, డాక్టర్ కిరణ్ బాబు మాట్లాడుతూ.. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుని అధిక లాభాలు గడించే మార్గాలను వివరించారు.
-
విత్తన ఎంపిక:
, వరిలో మేలైన రకాలను ఎంచుకోవాలని, నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని తెలిపారు. -
యజమాన్య పద్ధతులు: కొత్త సాంకేతిక పద్ధతులు, ఎరువుల సమతుల్య వినియోగం, చీడ-పీడల నివారణ మరియు నీటి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు.
-
పంట మార్పిడి: మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను సాగు చేయాలని, విచక్షణారహితంగా యూరియా వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ.. రైతులు పంటలు సాగు చేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా మనుషులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లపల్లి సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ.. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాలని, క్లస్టర్ పరిధిలో జనుము, జీలుగ వంటి పచ్చి రొట్ట విత్తనాలను అధిక మొత్తంలో సరఫరా చేయాలని కోరారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో లక్ష్మారావు గూడ సర్పంచ్ కుమార్, ఎట్లఎర్రవల్లి సర్పంచ్ నరసింహులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) గీత, శివతేజ, హార్టికల్చర్ అధికారి బలరాం, వివిధ శాఖల అధికారులు మరియు మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




