-
నీటి లోతు తెలియక మడుగులో చిక్కుకున్న వైనం
-
ఆసుపత్రిలో సౌకర్యాల లేమిపై గ్రామస్తుల ఆగ్రహం
-
నర్సాపూర్ (జి) మండలంలో మిన్నంటిన రోదనలు

(జి), మే 02: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి ఆనుకొని పారుతున్న సుద్ధవాగులో ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని నింపింది.
లోతు అంచనా వేయలేక..
మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రిజ్వాన్ ఓద్దీన్ (20), అబ్దుల్ అర్షద్ (22) అనే ఇద్దరు స్నేహితులు శుక్రవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సుద్ధవాగుకు వెళ్లారు. వాగులోని నీటి మడుగు వద్ద లోతును అంచనా వేయలేక దిగడంతో ఇద్దరూ నీటిలో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి, శ్వాస ఆడుతున్న స్థితిలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్య సౌకర్యాలపై నిరసన
నర్సాపూర్ (జి) ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా వారిని వెంటనే నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకులు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ గ్రామంలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అంది ఉంటే తమ పిల్లలు బతికేవారని బాధితులు, గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కళ్లెదుటే తోటి మిత్రులు ప్రాణాలు కోల్పోవడంతో యువకులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
మిన్నంటిన రోదనలు
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో నర్సాపూర్ (జి)లో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికొచ్చిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




