నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాయి సుప్రియ ఆసుపత్రిలో తానూర్ మండలం జరీ-బి గ్రామానికి చెందిన రుక్మిణి అనే మహిళ మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, వారం రోజుల క్రితం గర్భసంచిలో గడ్డ ఉందని వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం యూరిన్, మల విసర్జన కాకపోవడంతో పాటు కడుపు ఉబ్బడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
రెండు రోజుల క్రితం మళ్లీ కడుపు ఉబ్బడంతో ఆసుపత్రికి తీసుకురాగా స్కానింగ్ నిర్వహించి పేగు ముడత పడిందని చెప్పి మరోసారి ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం ఉదయం రుక్మిణి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మహిళ మృతితో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి జరిగిందని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

