మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో రెండు, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒకటి చొప్పున మొత్తం మూడు క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షించారు.
బెల్లంపల్లి పట్టణంలో మొత్తం 260 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించగా, నిమజ్జనం మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెరువు వద్ద సింగరేణి సిబ్బంది 96 మంది, మున్సిపల్ శాఖకు చెందిన 30 మంది, 8 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు చిన్న పిల్లలను నిమజ్జన ప్రాంతానికి తీసుకురావద్దని, ఊరేగింపు సమయంలో పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు నిర్వహించాలని సూచించారు.

