వేములవాడ పట్టణంలోని 23వ వార్డు బద్దిపోచమ్మ వీధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏడాది పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకతగా నిలిచింది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
కార్యక్రమానికి 23వ వార్డు కౌన్సిలర్ బోనాల సాగారిక-శివ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు కౌన్సిలర్‌ను శాలువాతో సత్కరించారు. తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితమైన మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ప్రతి సంవత్సరం ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

