జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ గంజి స్ట్రీట్ అంగన్వాడీ కేంద్రంలో 37, 38వ వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్లు సూచించారు. పిల్లలను అంగన్వాడీ ఫ్రీ స్కూల్కు పంపించాలని, బాలామృతాన్ని తప్పనిసరిగా అందించాలని కోరారు.
సీడీపీఓ జయప్రద మాట్లాడుతూ పోషణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. గర్భిణీలు, బాలింతలు అదనపు పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని, పిల్లల ఎదుగుదలను ప్రతి నెలా పరిశీలించాలని తల్లులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతం, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన, మూడేళ్లు పూర్తైన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది, వార్డు అధికారులు, ఆశా కార్యకర్తలు, తల్లులు, గర్భిణీలు, చిన్నారులు పాల్గొన్నారు.

