విశాఖపట్నం జీవీఎంసీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిరసిస్తూ మహా ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన పౌరులు, కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అనంతరం జీవీఎంసీ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు హాసిని వర్మ, వేగి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని హాసిని వర్మ డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

