మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గణేష్ చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని టౌన్, రూరల్ సీఐలు శ్రీనివాస్, హనోక్ ప్రజలకు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు ఆన్లైన్ యాప్‌లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలని, ఇద్దరు వాలంటీర్లను నిరంతరం పర్యవేక్షణకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద పేకాట, జూదం, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో చిన్నపిల్లలు, మహిళలను నీటి ప్రాంతాలకు దూరంగా ఉంచాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

