-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష
-
వారానికి మించి ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదు: మంత్రి జూపల్లి కృష్ణారావు
-
బేస్మెంట్ దశలో ఇబ్బంది పడే పేదలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు
హైదరాబాద్, ఏప్రిల్ 27
: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి మంత్రులు సుదీర్ఘంగా సమీక్షించారు.
నిర్మాణ ప్రక్రియలో జాప్యం వద్దు
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవ ప్రతీక అని, ఇందులో జాప్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని, ఏ ఒక్క ఫైలు కూడా అధికారుల వద్ద వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఉండకూడదని నిక్కచ్చిగా చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తెచ్చుకొని పనులను పరుగులు పెట్టించాలని కలెక్టర్లకు సూచించారు.
పేదలకు ఆర్థిక వెసులుబాటు
బేస్మెంట్ స్థాయి వరకు ఇల్లు నిర్మించుకునే స్తోమత లేని నిరుపేద లబ్ధిదారులను ఆదుకోవాలని మంత్రులు సూచించారు. అటువంటి వారికి స్వయం సహాయక సంఘాలు లేదా బ్యాంకుల ద్వారా రుణం అందేలా చూడాలని, ప్రభుత్వం నుంచి దశలవారీగా మంజూరయ్యే నిధులతో ఆ రుణాన్ని తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.
సమస్యల నివేదన
ఈ సమీక్షలో ఎంపీలు గడ్డం నగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్ బాబు తదితరులు పాల్గొని తమ నియోజకవర్గాల్లోని సాంకేతిక సమస్యలు, ఇళ్ల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
పాల్గొన్న ఉన్నతాధికారులు
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్లు రాజర్షి షా (ఆదిలాబాద్), హరిత (ఆసిఫాబాద్), భవేశ్ మిశ్రా (నిర్మల్), కుమార్ దీపక్ (మంచిర్యాల) తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇళ్ల పురోగతిపై అధికారులు మంత్రులకు నివేదికలు సమర్పించారు.

