-
ముందస్తు సమాచారం లేకుండానే విధుల్లోంచి తొలగింపు
-
నెల రోజులుగా అందని జీతాలు.. రోడ్డెక్కిన కాంట్రాక్ట్ కార్మికులు
-
కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుల ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన వైనం
షాబాద్, ఏప్రిల్ 24 
: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవల్లి సమీపంలో గల ‘డై ఫుకు’ (Daifuku) ప్రైవేట్ కంపెనీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక నెల జీతం నిలిపివేసి, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఉద్యోగాల నుండి తొలగించారంటూ కాంట్రాక్ట్ కార్మికులు కంపెనీ ముందు ధర్నాకు దిగారు.
కుటుంబాలు గడవడమే కష్టమైంది!
ఈ సందర్భంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. నెల రోజులుగా కష్టపడి పనిచేసినా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించడంతో తమ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించి, తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యంతో చర్చలు.. సోమవారం వరకు గడువు
బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు లంబడి కిరణ్ కుమార్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, బీజేపీ బూత్ అధ్యక్షుడు వినయ్ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధి చైతన్యతో చర్చలు జరిపారు. స్పందించిన ప్రతినిధి సోమవారం నాటికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, గతంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి మోసం చేశారని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మీడియా స్వేచ్ఛపై దాడి: ఫోన్లు లాక్కొని దురుసు ప్రవర్తన
కార్మికుల ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కంపెనీ సిబ్బంది బరితెగించారు. “మీకు ఇక్కడ కవరేజ్ ఇచ్చేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అంటూ హెచ్ఆర్ చైతన్యతో పాటు మురళీకృష్ణ, రామమూర్తి అనే సిబ్బంది జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా, మీడియా ప్రతినిధుల మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని, వారు చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలను డిలీట్ చేశారని సమాచారం.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు, స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని, దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, కంపెనీ ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.




