-
తో పోరాడుతున్న 10 ఏళ్ల రిషికేశ్వర్ -
ఇప్పటికే రూ. 35 లక్షల అప్పు.. మరో రూ. 20 లక్షలు ఉంటేనే వైద్యం
-
ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ప్రైవేట్ టీచర్ దంపతులు
మందమర్రి, ఏప్రిల్ 24: ఆ దంపతులు తాము రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే, పిల్లలను ప్రయోజకులను చేయాలనుకున్నారు. కానీ, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. బడికి వెళ్లి చదువుకుంటూ, తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన పదేళ్ల చిన్నారిని ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోంది. కొడుకును దక్కించుకునేందుకు ఆ తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇప్పుడు దాతల సాయం కోసం కన్నీటితో ఎదురుచూస్తున్నారు.
చిన్న వయసులో పెద్ద కష్టం
మందమర్రి రెండో జోన్లో నివాసం ఉంటున్న వేనవంక నారాయణ – శ్రీలత దంపతులు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు రిషికేశ్వర్ (10) మందమర్రి మాంటిస్సోరి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. నాలుగు నెలల క్రితం ఆడుకుంటూ ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు రిషికేశ్వర్కు బ్లడ్ క్యాన్సర్ (AML) అని నిర్ధారించడంతో ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది.
తమ్ముడి కోసం అక్క త్యాగం.. ప్రాణాల కోసం పోరాటం
తమ్ముడిని ఎలాగైనా రక్షించుకోవాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అక్క మనస్విత తన ‘బోన్ మ్యారో’ (Bone Marrow) ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్నదంతా ఖర్చు చేయడమే కాకుండా, తెలిసిన వారి వద్ద సుమారు రూ. 35 లక్షలు అప్పు చేసి నాలుగు నెలలుగా వైద్యం చేయిస్తున్నారు. అయితే, బాబు పూర్తిగా కోలుకుని బయటకు రావాలంటే మరో రూ. 20 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే అప్పుల భారంతో కుంగిపోయిన ఆ దంపతులు, అంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకురావాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు.
కష్టాల మీద కష్టాలు..
ఈ కుటుంబానికి కష్టాలు కొత్తేమీ కావు. మూడేళ్ల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వీరి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించి రోడ్డున పడ్డారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొడుకుకు క్యాన్సర్ రావడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది.
దాతలకు విన్నపం
“మా బాబును కాపాడుకోవడానికి మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. మనసున్న దాతలు స్పందించి మా బాబు ప్రాణాలు నిలబెట్టాలి” అని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
సహాయం చేయాలనుకునే దాతలు ఈ క్రింది నంబర్‌కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం అందించవచ్చు: నెంబర్: 9949156031 (వేనవంక నారాయణ శ్రీలత)
చిన్నారి రిషికేశ్వర్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోండి.




