- బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’
- ప్రపంచవ్యాప్తంగా రూ.1812 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం
- భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా రెండో స్థానానికి ఎగబాకిన వైనం
- ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రం సుమారు రూ.1,810 కోట్ల వసూళ్లతో ఇన్నేళ్లుగా రికార్డుల రారాజుగా కొనసాగింది. ఈ అసాధారణ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా అధిగమించలేదని ట్రేడ్ పండితులు భావించారు. అయితే, వారి అంచనాలను తలకిందులు చేస్తూ ‘ధురంధర్ 2’ ఈ రికార్డును బద్దలు కొట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ గ్రాస్‌ను దాటి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుత ట్రేడ్ నివేదికల ప్రకారం భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా వసూళ్లతో కలిపి సుమారు రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లతో ‘దంగల్’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా రూ.1,812 కోట్లతో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో నిలవగా, రూ.1,810 కోట్లతో ‘బాహుబలి 2’ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ జాబితాలో ‘పుష్ప 2’ (రూ.1,742 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ.1,300 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘ధురంధర్ 2’ ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుండటంతో దాని తుది వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 




