-
విద్యార్థుల ఆరోగ్యం లక్ష్యంగా భారీ తనిఖీలు
-
గుట్కా, నికోటిన్ పదార్థాలు భారీగా సీజ్
-
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: జాయింట్ సీపీ ఆర్. వెంకటేశ్వర్లు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): నగరంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరిట భారీ తనిఖీలు చేపట్టారు. చార్మినార్ జోన్ పరిధిలోని విద్యాసంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఏకకాలంలో 15 ప్రాంతాల్లో దాడులు
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు.. జాయింట్ సీపీ (సీఆర్ హెడ్ క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మలక్పేట్, చాదర్ఘాట్, సైదాబాద్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఒక్కో బృందంలో 8 నుండి 10 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న సుమారు 15 ప్రాంతాల్లోని పాన్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో గుట్కా, సిగరెట్లు, జర్ధా, నికోటిన్ కలిగిన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు
ఈ సందర్భంగా జాయింట్ సీపీ ఆర్. వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.
“పాఠశాలల చుట్టుపక్కల నిషేధిత పదార్థాల విక్రయాన్ని ఏమాత్రం సహించబోం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆపరేషన్ను మరింత కఠినంగా కొనసాగిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించి మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మేవారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.” — ఆర్. వెంకటేశ్వర్లు, జాయింట్ సీపీ
తల్లిదండ్రులు, యాజమాన్యాలకు విజ్ఞప్తి
విద్యార్థుల ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని, పాఠశాలల పరిసరాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా నిషేధిత పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీలతో నిబంధనలు అతిక్రమించే పాన్ షాపు యజమానుల్లో వణుకు మొదలైంది.




