న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): కరీంనగర్ – జగిత్యాల మధ్య జాతీయ రహదారి (NH-563) పనుల పురోగతిని వేగవంతం చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డా. బోగ శ్రావణి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, రహదారి విస్తరణ పనుల్లో ఎదురవుతున్న జాప్యంపై వినతిపత్రాన్ని అందజేశారు.
ప్రయాణికుల అవస్థలు – పెరుగుతున్న ప్రమాదాలు
ఈ సందర్భంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రహదారి పనులు నత్తనడకన సాగుతుండటంతో ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా నిర్మాణ పనులను యుద్ధప్రతిపాదికన ప్రారంభించి, నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళా బిల్లుపై ప్రతిపక్షాల కుట్రలు
అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ, ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు అనవసరపు రాజకీయాలు చేస్తూ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. ప్రధాని మోదీ నాయత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా అధిగమించి మహిళా బిల్లును అమలు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ భేటీలో రహదారి అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రావణి పేర్కొన్నారు.




