-
జగిత్యాల సభ పేరంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు
-
అబద్ధపు హామీలతో గద్దెనెక్కి సంక్షేమాన్ని తుంగలో తొక్కారు
-
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి?
కరీంనగర్, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): భారతదేశ చరిత్రలోనే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆయన సృష్టించిన చరిత్రను ఎవరూ చెరపలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల సభతో కాంగ్రెస్లో గుబులు
కేసీఆర్ బయటకు రావడం లేదని విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులకు, జగిత్యాల సభ ప్రకటనతోనే భయం పట్టుకుందని తలసాని ఎద్దేవా చేశారు. “కేసీఆర్ వస్తున్నారని తెలియగానే, హడావిడిగా రైతుబంధు వేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికల హామీలే కాకుండా, మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు.
సంక్షేమానికి మంగళం పాడారు
కేసీఆర్ కిట్, దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని తలసాని విమర్శించారు. “ఎన్నికల సమయంలో రెట్టింపు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఉన్న పథకాలను కూడా బంద్ చేసింది. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే ఈ రెండున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు” అని ధ్వజమెత్తారు.
భారీగా తరలిరావాలని పిలుపు
రేపు జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని తలసాని వెల్లడించారు.
పాల్గొన్న నేతలు: ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మహేష్, మైనార్టీ నాయకులు మీర్ సౌఖత్ అలీ, నారదాసు వసంతరావు, గూడెల్లి రాజ్ కుమార్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




