-
మాట వినడం లేదని కనికరం లేకుండా ప్రతాపం
-
అడ్డుకున్న మేకల కాపరి.. అక్కడి నుంచి పరారైన తండ్రి
-
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
మందమర్రి, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): మందమర్రి మండలంలో కన్నతండ్రి తన కుమార్తెపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం తన మాట వినడం లేదన్న సాకుతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
అడవి ప్రాంతంలో ఘాతుకం:
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సదరు వ్యక్తి తన కుమార్తెను వాహనంపై అడవి ప్రాంతంలోని సోలార్ ప్లాంట్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై తీవ్రస్థాయిలో భౌతిక దాడికి దిగాడు. బాధితురాలు ప్రాధేయపడినా వదలకుండా అమానుషంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
మేకల కాపరి అడ్డుకోవడంతో..
సరిగ్గా అదే సమయంలో సమీపంలో మేకలను కాస్తున్న ఓ వ్యక్తి ఈ దారుణాన్ని గమనించాడు. వెంటనే అక్కడికి చేరుకుని తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. పరిస్థితి తన చేయి దాటిపోతుందని, స్థానికులు వస్తారని భయపడిన తండ్రి, వెంటనే కూతురిని బలవంతంగా వాహనంపై ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల విచారణ:
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కూతురు తన మాట వినడం లేదన్న ఆగ్రహంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అసలు ఆ తండ్రి ఎవరు? ఆ బాలిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.





