నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శ్రావణమాసం అమావాస్య సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామపంచాయతీ సమీపంలోని అమ్మవారి గద్దె వద్ద ముడుపులు విప్పి, నైవేద్యం సమర్పించి గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు.
అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో గ్రామ దేవతలకు ముడుపులు కట్టి, మాసం ముగిసిన అనంతరం వాటిని విప్పి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ తెలిపారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వార్డు సభ్యులు, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, సుభాష్, చెలిమెల నర్సయ్య, చక్రపాణి, విడిసి సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

