-
షెడ్డు నిర్మాణంపై రెండు వర్గాల మధ్య వివాదం
-
పోలీసుల జోక్యంతో వాగ్వాదం.. హామీ తర్వాతే సద్దుమణిగిన నిరసన
ముప్కాల్, ఏప్రిల్ 30: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో బస్టాప్ నిర్మాణ విషయమై ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత కొన్ని ఏళ్లుగా ప్రజల సౌకర్యార్థం ఉన్న బస్టాప్ షెడ్డును కొందరు వ్యక్తులు తొలగించడంతో వివాదం మొదలైంది.
అడ్డుకున్న పోలీసులు.. గ్రామస్తుల ఆగ్రహం
తొలగించిన చోటే తిరిగి బస్టాప్ షెడ్డును నిర్మించేందుకు గ్రామస్తులు గురువారం ప్రయత్నించారు. అయితే, కొందరు స్థానిక నాయకులు ఈ నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని, వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నిర్మాణం చేపడుతున్న సమయంలో పోలీసులు అక్కడకు చేరుకుని, అనుమతి పత్రాలు చూపాలని పనులను అడ్డుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల హామీతో విరమణ
తమ సొంత ఊరిలో, దశాబ్దాలుగా ఉన్న బస్టాప్ను పునర్నిర్మించుకోవడానికి అనుమతి ఎందుకని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిర్మించిన షెడ్డును తిరిగి తొలగించబోమని పోలీసులు లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఉద్రిక్తత పెరుగుతుండటంతో పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి, షెడ్డు తొలగింపు విషయంలో సానుకూల హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు తమ నిరసనను విరమించారు. ఈ ఘటనతో బస్టాప్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

