-
కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
-
రూ. 50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
-
హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ గతే పడుతుంది: కొయ్యల ఏమాజి
ఆసిఫాబాద్, ఏప్రిల్ 24
: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ఆసిఫాబాద్ డిపో ఎదుట కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తమ బృందంతో కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పట్టణంలో భారీ ర్యాలీ.. పోలీసులతో వాగ్వివాదం
కార్మికులకు సంఘీభావంగా బీజేపీ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ నిర్లక్ష్యమే శంకర్ గౌడ్ బలి
ఈ సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. “కార్మికుల సమస్యలు ముందే పరిష్కరించి ఉంటే ఆయన బ్రతికేవారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి” అని డిమాండ్ చేశారు.
హామీలు నెరవేర్చకుంటే పతనం తప్పదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాలను రద్దు చేసి, వారి హక్కులను కాలరాసి కార్మికులను మోసం చేసిందని ఏమాజి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు.
కార్మికులు ధైర్యంగా ఉండాలి
సమస్యల పరిష్కారం కోసం పోరాడాలే తప్ప, ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కార్మికులకు ఏమాజి విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌సిఐ బోర్డు సభ్యులు పులగం తిరుపతి, కేశవరెడ్డి, గోవర్ధన్, విశాల్ ఖండ్రే, బీజేపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.




