-
కార్మికులతో కలిసి నిరసన తెలిపిన బీఎస్పీ నేతలు
-
రూ. 9,500 కోట్ల పాత అప్పులను ప్రభుత్వమే భరించాలి
-
20 వేల ఖాళీ పోస్టుల భర్తీకి డిమాండ్
మంచిర్యాల, ఏప్రిల్ 24
: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కమిటీ శుక్రవారం ఆర్టీసీ కార్మికుల నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపింది. జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ జోన్ ఇంచార్జ్ కాదాసి రవీందర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
విలీన చట్టం అమలులో ఎందుకు జాప్యం?
ఈ సందర్భంగా కాదాసి రవీందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ విలీన చట్టం-2023ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని కేవలం కాగితాల మీద కాకుండా, ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే కొత్త సర్వీస్ రూల్స్ విడుదల చేసి, ఉద్యోగులందరినీ పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ హోదా కల్పించాలని కోరారు.
ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి చేయాలి
ఆర్టీసీపై ఉన్న సుమారు రూ. 9,500 కోట్ల పాత అప్పులను ప్రభుత్వమే స్వీకరించి, సంస్థను ఆర్థిక విముక్తి చేయాలని రవీందర్ డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల నుండి యాజమాన్యం వాడుకున్న రూ. 1,200 కోట్ల పీఎఫ్, సిసిఎస్ నిధులను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని, రూ. 3,500 కోట్ల పీఎఫ్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలని స్పష్టం చేశారు. 2021–2025 వేతన సవరణను తక్షణమే ప్రకటించి, సరైన ఫిట్మెంట్తో కొత్త వేతనాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
20 వేల ఖాళీల భర్తీకి డిమాండ్
గత పదేళ్లలో ఖాళీ అయిన సుమారు 20 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయడం ద్వారా కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని సూచించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులకు బీఎస్పీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామిల్ల మురళి, కార్యాలయ కార్యదర్శి రాచర్ల సురేష్, ఈసీ సభ్యులు సెట్టి ప్రవళిక, నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగాం శ్రీనివాస్, ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, బామ్ సేఫ్ జిల్లా కన్వీనర్ సెట్టి శంకరయ్య, ఆర్టీసీ కార్మిక నేతలు మరియు కార్మికులు పాల్గొన్నారు.




