-
దివ్యాంగురాలు శిరీషకు అండగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
-
మంత్రి ఆదేశాలతో తక్షణమే వాహనం అందజేత
-
మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన శిరీష
ధర్మపురి, ఏప్రిల్ 23
: “కష్టాల్లో ఉన్నానని ‘అన్న’ అని ఆశ్రయిస్తే, నా బాధను అర్థం చేసుకుని స్కూటీ ఇచ్చి ఆదుకున్నాడు మా మంత్రి లచ్చన్న” అంటూ దివ్యాంగురాలు శిరీష ఉద్వేగానికి లోనయ్యారు. తనలాంటి సామాన్యుల కష్టాలను గుర్తించి ఆదుకుంటున్న ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ ప్రయాణం భారంగా మారి..
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామపూర్ గ్రామానికి చెందిన జొన్నల శిరీష ఒక దివ్యాంగురాలు. కుటుంబ పోషణ నిమిత్తం ఆమె హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, తన శారీరక వైకల్యం కారణంగా నిత్యం ఆఫీసుకు వెళ్లడం, హైదరాబాద్ మహానగరంలో ప్రయాణం చేయడం ఆమెకు అత్యంత భారంగా మారింది.
మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉదారత
ఈ నేపథ్యంలో, తనకు ప్రభుత్వం ద్వారా ఏదైనా వాహనాన్ని సమకూర్చాలని కోరుతూ ఇటీవల ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను శిరీష కలిశారు. ఆమె పడుతున్న ఇబ్బందులను విని చలించిపోయిన మంత్రి, వెంటనే స్పందించారు. తన శాఖ ద్వారా శిరీషకు త్రీ-వీలర్ స్కూటీని మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో వాహనం అందజేత
మంత్రి ఆదేశాల మేరకు గురువారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు శిరీషకు స్కూటీని అందజేశారు. తనకు ఎంతో అవసరమైన వాహనాన్ని అతి తక్కువ కాలంలోనే అందజేసినందుకు శిరీష ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్కూటీ తన ఉద్యోగ ప్రయాణానికి మరియు జీవనోపాధికి ఎంతో తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు.




