-
మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలకు ప్రజల వినతి
-
ఆదాయం లేదన్న ప్రచారం అబద్ధం.. ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించాలి
మందమర్రి, ఏప్రిల్ 23: కరోనా కష్టకాలం నుంచి మందమర్రి రైల్వే స్టేషన్లో నిలిపివేసిన పలు రైళ్ల హాల్టింగ్లను పునరుద్ధరించాలని కోరుతూ మండల ప్రజలు, కార్మికులు గళమెత్తారు. ముఖ్యంగా రామగిరి, సింగరేణి, కాగజ్నగర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు గతంలో ఇక్కడ ఆగేవి. అయితే కోవిడ్ తర్వాత వీటి హాల్టింగ్లను తొలగించడంతో సామాన్య ప్రయాణికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
అసత్య ప్రచారాలను నమ్మొద్దు
గతంలో ఈ సమస్యపై అప్పటి ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి స్టేషన్కు ఆదాయం లేదని, ప్రయాణికులు తక్కువగా ఉంటారనే దుష్ప్రచారాన్ని కొందరు చేస్తున్నారని వారు మండిపడ్డారు.
-
ఖనిజ రవాణాతో భారీ ఆదాయం: మందమర్రి స్టేషన్ ద్వారా బొగ్గు, ఇతర ఖనిజ రవాణా వల్ల రైల్వే శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోందని గుర్తు చేశారు.
-
సేవా సంస్థగా రైల్వే: రైల్వే అనేది కేవలం లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు సౌకర్యాలు కల్పించే సేవా సంస్థ అని, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు
ప్రస్తుతం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ విషయంలో చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. మందమర్రి కీలకమైన మండల కేంద్రమని, కార్మిక ప్రాంతమని పేర్కొంటూ.. వారు స్వయంగా స్టేషన్ను సందర్శించి రైళ్ల హాల్టింగ్లను పునరుద్ధరించేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, ఉద్యోగుల అవసరాలను దృష్ట్యా తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




