-
కవితక్క నాయకత్వమే లక్ష్యంగా నూతన రాజకీయ ప్రస్థానం
-
జాగృతిలో చేరిన పలువురు మహిళా నేతలు
-
బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ విమర్శలు
కరీంనగర్, ఏప్రిల్ 21
: తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కేవలం రాజకీయ బలప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాజకీయ లబ్ధి కోసమే పాకులాట
వరుస ఓటములతో సతమతమవుతున్న నాయకులను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధాన్ని తెంచుకుందని హరిప్రసాద్ ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకు రావడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మండిపడ్డారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్కు కూడా తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని ఆయన ధ్వజమెత్తారు.
త్వరలో నూతన ప్రస్థానం
తెలంగాణ సమస్యల పరిష్కారమే అజెండాగా, కవితక్క నాయకత్వంలో త్వరలోనే నూతన రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని హరిప్రసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రయోజనాలను కాపాడగలిగే సత్తా కేవలం కవితక్కకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం
ఈ సందర్భంగా కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, ఆమెను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పలువురు మహిళా నేతలు తెలంగాణ జాగృతిలో చేరారు. వీరికి హరిప్రసాద్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రజల పక్షాన పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని, జాగృతి ఆ దిశగా అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




